ఆమె దేశానికి గర్వకారణం.. వినేశ్ ఫోగట్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Vinesh Phogat Relief from Supreme Court in Asian Games Selection Trials
  • 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్ ఫోగట్‌కు అనుమతి
  • ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రెజ్లింగ్ ఫెడరేషన్ పిటిషన్‌పై విచారణ
  • వినేశ్ దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
  • క్రీడా వ్యవహారాల్లో హైకోర్టుల మితిమీరిన జోక్యంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు
  • ఈ కేసులో పూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
భారత స్టార్ రెజ్లర్, మూడుసార్లు ఒలింపియన్‌గా దేశానికి ప్రాతినిధ్యం వహించిన వినేశ్ ఫోగట్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2026 ఏషియన్ గేమ్స్ కోసం ఈ నెల‌ 30, 31 తేదీల్లో జరగనున్న సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డ‌బ్ల్యూఎఫ్ఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వినేశ్ ఫోగట్‌కు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని గత వారం ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మాతృత్వం అనేది ఒకరి వృత్తిపరమైన అవకాశాలను అడ్డుకునే వైకల్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సమాఖ్య నిబంధనల ప్రకారం వినేశ్‌కు అర్హత లేదని వాదిస్తూ డబ్ల్యూఎఫ్‌ఐ, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ) దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "ఆమె స్థానంలో వేరే ఎవరైనా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ, వినేశ్ దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారిణి" అని ధర్మాసనం అభిప్రాయపడింది. "హైకోర్టు తీర్పుతో ఆమెలో ఆశలు, అంచనాలు పెరిగాయి. ఈ దశలో మేం ఏమీ చేయలేమని చెప్పి ఆమెను వెనక్కి పంపడం సరికాదు" అని డబ్ల్యూఎఫ్‌ఐ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది.

అయితే, వినేశ్‌కు తాత్కాలికంగా అనుమతి ఇస్తూనే, క్రీడా వ్యవహారాల్లో హైకోర్టులు తరచుగా, అత్యంత వేగంగా జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "ఇవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లు కాదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించినవి. ఈ పద్ధతిలో కోర్టులు జోక్యం చేసుకొని, మొత్తం షెడ్యూల్‌ను దెబ్బతీయలేవు" అని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతానికి వినేశ్‌కు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు, డబ్ల్యూఎఫ్‌ఐ దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాల్సిందిగా వినేశ్ ఫోగట్‌ను ఆదేశించింది.
Go Back to Shorts
Vinesh Phogat
Wrestling Federation of India
Asian Games 2026
Supreme Court
Delhi High Court
WFI
Wrestler selection trials
Indian wrestler
Justice PS Narasimha
Alok Aradhe

More Telugu News