సిద్ధరామయ్య రాజీనామా.. పదవుల కన్నా పార్టీయే గొప్పదన్న కాంగ్రెస్

Siddaramaiah Resigns Party Above Positions Says Congress
  • కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
  • పదవుల కంటే పార్టీ, ప్రజలే ముఖ్యమన్న‌ ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ 
  • సిద్ధరామయ్య గురించి భావోద్వేగంగా మాట్లాడిన‌ సీనియర్ నేత ప్రియాంక్ ఖర్గే
  • సంక్షేమ పాలనతో సిద్ధరామయ్య ప్రజల నేతగా ఎదిగారని ఖర్గే ప్రశంస
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పదవుల కన్నా పార్టీకి, ప్రజలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. నేడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో ఆయన ఒక పోస్ట్ చేశారు. "వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, అధికారం కన్నా ప్రజలే ముఖ్యం. ఎందుకంటే కాంగ్రెస్‌కు పార్టీయే కుటుంబం, ప్రజలే మా లక్ష్యం" అని అందులో పేర్కొన్నారు.

సిద్ధరామయ్య రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. కర్ణాటకలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల మధ్య పార్టీ క్రమశిక్షణ, సమష్టి నాయకత్వాన్ని చాటిచెప్పేందుకే వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. సంక్షేమ పాలన, సైద్ధాంతిక నిబద్ధత, రాజకీయ పోరాటాలతో ప్రజల ప్రేమను, నమ్మకాన్ని గెలుచుకున్న నేత సిద్ధరామయ్య అని ఆయన కొనియాడారు. కర్ణాటకలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా రికార్డు సృష్టించారని, కాంగ్రెస్ పార్టీ ప్రజానుకూల కార్యక్రమాలతో ఆయన ప్రజల నాయకుడిగా ఎదిగారని అన్నారు.

"రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, సామ్యవాద సూత్రాలకు కట్టుబడి ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారు. మా తరం నేతలకు, భవిష్యత్ యువ రాజకీయ నాయకులకు ఆయన ఒక స్ఫూర్తి" అని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో సిద్ధరామయ్య మార్గదర్శకత్వాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన నాయకత్వంలో అవినీతి రహిత, అభివృద్ధి ఆధారిత పాలన అందిందని, గ్యారంటీ పథకాలతో ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించామని తెలిపారు. అలాంటి గొప్ప నేత కేబినెట్‌లో మంత్రిగా పనిచేయడం గర్వకారణమని ఖర్గే వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Siddaramaiah
Karnataka politics
KC Venugopal
Congress party
Karnataka government
Priyank Kharge
AICC
Thawar Chand Gehlot
Karnataka CM

More Telugu News