రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ హైదరాబాద్‌లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్‌కు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించి సర్‌ప్రైజ్ చేశాడు. తాను ధరించే ఆర్సీబీ జెర్సీపై సంతకం చేసి అయాన్‌కు బహూకరించాడు.

ఈ అనూహ్యమైన బహుమతికి అల్లు అర్జున్ కుటుంబం ఎంతగానో సంతోషించింది. ఈ ఆనందకర క్షణాలకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. వెంకటేష్ అయ్యర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

"ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్‌కు ప్రత్యేకంగా సంతకం చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చినందుకు అతడికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మీయ శుభాకాంక్షలు" అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.