ఉద్యోగం ఉఫ్‌.. అమెరికాలో ఉండేందుకు 60 రోజులే గడువు!

H1B Visa Holders Face Deadline After US Layoffs
  • కంపెనీల లేఆఫ్స్‌తో ఉద్యోగులకు కష్టాలు
  • ఉద్యోగం పోయాక 60 రోజులే గడువు 
  • ప్రత్యామ్నాయంగా విజిటర్ వీసాలకు దరఖాస్తు
  • వాటినీ తిరస్కరిస్తున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
అమెరికాలో స్థిరపడాలనే కలలతో వెళ్లిన వేలాది మంది ఐటీ ఉద్యోగుల జీవితాలు ఇప్పుడు తలకిందులయ్యాయి. మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి అగ్రశ్రేణి కంపెనీల్లో జరుగుతున్న లేఆఫ్స్ అక్కడి భారతీయులను కోలుకోలేని దెబ్బ తీశాయి. అమెరికా వీసా నిబంధనల ప్రకారం కేవలం 60 రోజుల్లో కొత్త ఉద్యోగం దొరక్కపోతే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

కత్తిమీద సాము
అమెరికా ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం హెచ్-1బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోతే, కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి కేవలం 60 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ప్రస్తుతం ఐటీ రంగంలో నియామకాలు మందగించడంతో ఈ లోపు మరో ఉద్యోగం సంపాదించడం కష్టంగా మారింది. దీంతో ఇళ్లు, పిల్లల చదువులు, లోన్లు ఉన్న ఎందరో భారతీయుల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది.

విజిటర్ వీసా రూట్
ఈ 60 రోజుల గడువును మరికొంత కాలం పొడిగించుకోవడానికి చాలా మంది ఉద్యోగులు తాత్కాలికంగా బి-2  విజిటర్ వీసాలోకి మారేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల మరో ఆరు నెలల సమయం దొరుకుతుంది. అయితే ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ వాతావరణంలో అధికారులు దీనిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదనపు ఆధారాలు అడగటంతో పాటు, ఈ అప్లికేషన్లను భారీగా తిరస్కరిస్తున్నారని ఇమ్మిగ్రేషన్ లాయర్లు చెబుతున్నారు.

నష్టపోతున్నది భారతీయులే
అమెరికా హెచ్-1బీ వీసాలను అత్యధికంగా పొందుతున్నది భారతీయులే. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన మొత్తం 4.06 లక్షల వీసాల్లో దాదాపు 2.83 లక్షలు భారతీయులకే దక్కాయి. ఇప్పుడు లేఆఫ్స్ వల్ల ఈ భారీ డిపెండెన్సీనే వారికి శాపంగా మారింది. దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న ఐటీ నిపుణులు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

కెనడా, యూరప్ వైపు చూపు
అమెరికాలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో చాలా మంది భారతీయ ప్రొఫెషనల్స్ ఇప్పుడు కెనడా, యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. కెనడాకు చెందిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు విద్యార్థి వీసాలు, లేదా కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ వీసాల వైపు మొగ్గు చూపుతున్నారు.
Go Back to Shorts
H1B Visa
USA Jobs
Indian IT Professionals
Layoffs
US Immigration
B2 Visitor Visa
Canada Immigration
Europe Jobs
Green Card
Meta Amazon Oracle

More Telugu News