అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితుల కారణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత వారం తగ్గుముఖం పట్టిన పసిడి ధర, మంగళవారం మళ్లీ స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050గా నమోదైంది. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టడం గమనార్హం.

ప్రముఖ వెబ్‌సైట్ గుడ్ రిటర్న్స్ అందించిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,43,960 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు, కిలో వెండి ధర రూ.2,99,900గా పలికింది. దేశంలోని చాలా నగరాల్లో వెండి ధర కిలోకు రూ.3 లక్షల కంటే తక్కువకు పడిపోయింది.

ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరల్లో స్వల్ప తేడాలు కనిపించాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,230గా ఉండగా, ముంబైలో రూ.1,57,050, ఢిల్లీలో రూ.1,57,200గా నమోదైంది. దాదాపు అన్ని నగరాల్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.43 లక్షల పైనే కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,491 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, ఔన్స్ వెండి 74 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ వంటి అంశాలు సమీప భవిష్యత్తులో కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.