యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్లు భిన్నరీతిలో స్పందించారు. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నా, ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాల్సి ఉందని మహమ్మద్ కైఫ్ హెచ్చరించగా, అతని బ్యాటింగ్ శైలిని హర్భజన్ సింగ్ ఆకాశానికెత్తాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి అనంతరం వీరిద్దరూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు.

ఈ సందర్భంగా మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. వైభవ్ భారత జట్టుకు ఆడాలంటే తన ఫీల్డింగ్ నైపుణ్యాలను తప్పనిసరిగా మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశాడు. "ఆటగాళ్లను ఎంపిక చేసే స్కౌట్లు ఫీల్డింగ్ టెస్టు కూడా నిర్వహించాలి. వైభవ్ ఒక్క క్యాచ్ కూడా పట్టినట్టు నేను చూడలేదు. ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక బంతి మంచి ఎత్తులో అతని వద్దకు వచ్చింది. ఆ క్యాచ్ పట్టడానికి అతను సరైన పొజిషన్‌లో ఉన్నప్పటికీ, అనవసరంగా గాల్లోకి ఎగిరి జారవిడిచాడు. బ్యాటింగ్‌లో అతను చాలా ప్రతిభావంతుడు, కానీ ఫీల్డింగ్ విషయంలో అతను ఇంకా సిద్ధంగా లేడు" అని కైఫ్ విశ్లేషించాడు.

మరోవైపు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌ను ఎదుర్కోవడం ఏ బౌలర్‌కైనా సవాల్ అని అన్నాడు. "వైభవ్‌కు బౌలింగ్ చేయాల్సి వస్తే, ఎలాగైనా అతని వికెట్ తీయాలనే ప్లాన్‌తో వెళతా. కానీ, అతను ఉన్న ఫామ్‌కు అది కష్టమే. అతని హిట్టింగ్ ఆర్క్‌కు దూరంగా బంతిని స్పిన్ చేయడమే నా వ్యూహం. నేను ఎంతో మంది ఆటగాళ్లతో ఆడాను. క్రిస్ గేల్ వికెట్‌ను కూడా చాలాసార్లు తీశాను. కానీ, వైభవ్ ఒక డిఫరెంట్ లెవెల్. 15 ఏళ్ల వయసులో ప్రతి బౌలర్‌ను సిక్సర్లు కొట్టడం మాములు విష‌యం కాదు" అని భజ్జీ కొనియాడాడు.

మొత్తం మీద బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ, ఫీల్డింగ్‌లో కూడా రాణిస్తేనే జాతీయ జట్టులో స్థానం సులభమవుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.