ఒకప్పుడు గోధుమ పంటకు అడ్డా... ఇప్పుడక్కడ మన రొయ్య మీసం మెలేస్తోంది!

Rupinder Kaur Punjab Shrimp Farming Success Story
  • పంజాబ్‌లోని ఉప్పు భూముల్లో రొయ్యల సాగుతో అద్భుతం
  • గోధుమలు పండని చోట ఎకరాకు రూ. 8 లక్షల లాభం
  • ఈ విజయానికి కీలకం మన ఆంధ్రప్రదేశ్ రొయ్య సీడ్
  • వ్యవసాయ వైవిధ్యానికి ఆదర్శంగా నిలిచిన రూపిందర్ కౌర్
ఒకప్పుడు గోధుమ పంటకు ప్రసిద్ధి చెందిన పంజాబ్ బీడు భూముల్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రొయ్య హవా నడుస్తోంది. శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లాలోని ఉప్పు నీటితో నిండి, వ్యవసాయానికి పనికిరావని వదిలేసిన పొలాల్లో ఓ మహిళా రైతు అద్భుతాలు సృష్టిస్తున్నారు. గోధుమ, వరి పంటలు విఫలమైన చోట ఏపీ నుంచి వెళ్లిన రొయ్య సీడ్‌తో కాసుల పంట పండిస్తున్నారు.

పంజాబ్‌లోని ఇన్నా ఖేరా గ్రామానికి చెందిన రూపిందర్ కౌర్ ఈ విజయగాథకు స్ఫూర్తిగా నిలిచారు. ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన ఆమె, తన కుటుంబంతో కలిసి వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. లవణీయత ఎక్కువగా ఉన్న భూముల్లో సంప్రదాయ పంటలు నష్టాలు తేవడంతో, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారుల సూచనతో రొయ్యల పెంపకం వైపు దృష్టి సారించారు.

2021లో కేవలం 5.5 ఎకరాలతో ప్రారంభమైన వీరి ప్రయాణం, ప్రభుత్వ 60% సబ్సిడీ, బ్యాంకు రుణంతో ఊపందుకుంది. ఈ సాగుకు అత్యంత కీలకమైన 'లిటోపెనేయస్ వన్నమీ' రకం రొయ్య సీడ్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. మొదటి ఏడాదే ఊహించని లాభాలు రావడంతో, పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చింది. ప్రస్తుతం సొంత భూమి, లీజుతో కలిపి 35 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తూ, ఎకరాకు ఏటా రూ. 7 నుంచి 8 లక్షల నికర లాభం ఆర్జిస్తున్నారు.

రొయ్యల వ్యర్థాలను ప్రోటీన్‌గా మార్చే బయోఫ్లాక్ వంటి ఆధునిక టెక్నాలజీలను కూడా వినియోగిస్తున్నారు. కేవలం 120 రోజుల్లోనే పంట చేతికి వస్తుండటంతో సంవత్సరానికి రెండు పంటలు తీస్తున్నారు. రూపిందర్ కౌర్ సాధించిన ఈ విజయం, పంజాబ్‌లో వ్యవసాయ వైవిధ్యానికి కొత్త మార్గం చూపడమే కాకుండా, ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె సేవలను గుర్తించి ప్రభుత్వం 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించింది.
Go Back to Shorts
Rupinder Kaur
Punjab shrimp farming
shrimp farming
Litopenaeus vannamei
biofloc technology
Andhra Pradesh shrimp seed
shrimp cultivation
Punjab agriculture
fisheries department
Inna Khera

More Telugu News