వెంకటేష్ అయ్యర్ ఫైర్, కోహ్లీ ఫిఫ్టీ... ఆర్సీబీ భారీ స్కోరు... పంజాబ్ కు పెను సవాల్!

Venkatesh Iyer Fires Kohli Fifty RCB Sets Huge Target Against Punjab
  • ఆర్సీబీ స్కోరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 రన్స్
  • పంజాబ్ కింగ్స్‌ ముందు భారీ లక్ష్యం
  • అజేయంగా 73 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్
  • విరాట్ కోహ్లీ కీలక హాఫ్ సెంచరీ
  • ఆకట్టుకున్న హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్
  • మిగిలిన పంజాబ్ బౌలర్లు తేలిపోయారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్), విరాట్ కోహ్లీ (58) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఆ జట్టు బౌలర్ల ప్రణాళికలను ఆర్సీబీ బ్యాటర్లు పూర్తిగా చిత్తుచేశారు. ఓపెనర్ జాకబ్ బెతెల్ (11) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ (45), కేవలం 25 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

కోహ్లీ, పడిక్కల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28) కూడా తన వంతుగా మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ స్కోరు 220 మార్కును దాటింది. అర్ధ సెంచరీ పూర్తయ్యాక వెంకటేష్ అయ్యర్.. దళపతి విజయ్ (ప్రస్తుతం తమిళనాడు సీఎం) తరహాలో రెండు చేతులు క్రాస్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.

పంజాబ్ బౌలర్లలో ఒక్క హర్‌ప్రీత్ బ్రార్ మాత్రమే ఆకట్టుకున్నాడు. అతను 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసినప్పటికీ, పరుగులను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్ లో గెలుపు పంజాబ్ కు చాలా అవసరం. ప్లే ఆఫ్ సమీకరణాలు అత్యంత సంక్లిష్టంగా మారిన తరుణంలో ఇక ప్రతి మ్యాచ్ లోనూ గెలుపు తప్పనిసరి. నేటి మ్యాచ్ లో ఆర్సీబీ గనుక గెలిస్తే, ఆ జట్టు ప్లే ఆఫ్ దశలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. 
Go Back to Shorts
Venkatesh Iyer
Virat Kohli
RCB vs PBKS
Royal Challengers Bangalore
Punjab Kings
IPL 2026
Indian Premier League
Dharamshala
Cricket
Harpreet Brar

More Telugu News