తిరుమలలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భారీగా టోల్ ఫీజు... టీటీడీ యోచన!

TTD EO Ravi Chandra Announces Toll Fee Hike for Petrol Diesel Vehicles in Tirumala
  • తిరుమలలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై భారీ టోల్ విధింపునకు టీటీడీ యోచన
  • ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి, పర్యావరణాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం
  • అలిపిరి వద్ద రూ.500 కోట్లతో అన్ని సౌకర్యాలతో భారీ టౌన్‌షిప్ నిర్మాణం
  • తిరుమలను 'సైలెన్స్ జోన్'గా మార్చి, శబ్ద కాలుష్యాన్ని 80 శాతం తగ్గించేందుకు ప్రణాళిక
  • రూ.100 కోట్లతో అన్నదానం వంటశాల ఆధునికీకరణ, ఏఐ ఆధారిత నిర్వహణ
తిరుమల పవిత్రతను కాపాడుతూ, పర్యావరణ హితమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తిరుమల కొండపైకి వెళ్లే పెట్రోల్, డీజిల్ వాహనాలపై భారీగా టోల్ ఫీజు విధించాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ప్రోత్సాహం కల్పించడంతో పాటు, అలిపిరి వద్దే రూ.500 కోట్లతో ఒక భారీ టౌన్‌షిప్‌ను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర కీలక వివరాలను వెల్లడించారు.

ప్రస్తుతం రోజుకు సగటున 8,000 వాహనాలు తిరుమలకు వస్తుండటంతో పర్యావరణ, శబ్ద కాలుష్యం పెరుగుతోందని రవిచంద్ర తెలిపారు. దీన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పెట్రోల్, డీజిల్ వాహనాలపై భారీ టోల్ విధించనున్నారు. అయితే, ఈ నిర్ణయం వెంటనే అమలులోకి రాదని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చి, వాటి కోసం ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఈ ప్రణాళికలో మరో కీలకమైన అంశం అలిపిరి వద్ద రూ.500 కోట్ల వ్యయంతో భారీ టౌన్‌షిప్ నిర్మాణం. సుమారు 150 ఎకరాల్లో నిర్మించే ఈ టౌన్‌షిప్‌లో వసతి, పార్కింగ్, భోజన సౌకర్యాలు, పూజా సామగ్రి వంటి అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. "దీన్ని తిరుమల కొండ దిగువ భాగంలో అభివృద్ధి చేస్తాం" అని ఈవో తెలిపారు. భక్తులు ఇక్కడే తమ మొక్కులు తీర్చుకుని, ఆ తర్వాత దర్శనం కోసం కొండపైకి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు.

వీటితో పాటు, తిరుమలను కఠినంగా 'సైలెన్స్ జోన్‌'గా అమలు చేసి, శబ్ద కాలుష్యాన్ని 80 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.100 కోట్లతో అన్నదానం వంటశాలను ఆధునికీకరించడం, క్యూలైన్లకు బదులు భక్తులను నేరుగా అన్నదానం హాల్స్‌కు పంపడం వంటి చర్యలు కూడా చేపట్టనున్నారు. ఈ సంస్కరణల ద్వారా భక్తులను నిరుత్సాహపరచడం కాదని, వారి దర్శనాన్ని మరింత ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా మార్చడమే తమ ఉద్దేశమని ఈవో రవిచంద్ర వివరించారు.
Go Back to Shorts
TTD EO Ravi Chandra
Tirumala
Tirupati
Tirumala Tirupati Devasthanam
Electric Vehicles
Alipiri Township
Toll Fee
Environmental Pollution
Silence Zone
Annadanam

More Telugu News