ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో గుజరాత్ ముందు 248 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.

ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగి సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 93 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ అజింక్యా రహానే (14) విఫలమైనప్పటికీ, అలెన్ విధ్వంసం కేకేఆర్ కు బలమైన పునాది వేసింది.

వన్ డౌన్ లో వచ్చిన యువ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశీ, ఆఖర్లో కామెరాన్ గ్రీన్ కూడా అదే జోరును కొనసాగించారు. వీరిద్దరూ అజేయ అర్ధ శతకాలతో మెరిశారు. రఘువంశీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, కామెరాన్ గ్రీన్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు సాధించి అజేయంగా నిలిచారు. వీరిద్దరి దూకుడుతో కోల్‌కతా స్కోరు 240 దాటింది.

మరోవైపు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. మహమ్మద్ సిరాజ్, సాయి కిశోర్ చెరో వికెట్ పడగొట్టినప్పటికీ, బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు ఇవ్వడం గమనార్హం.