సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష
- 2019లో ఉన్నతాధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసు
- జైలు శిక్ష విధించిన ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు
- ఇప్పటికే ఇతర కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న అజాంఖాన్
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ కు ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో జిల్లా అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించింది. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని ప్రస్తుతం రాంపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అజాంఖాన్‌కు ఈ తాజా తీర్పు కోలుకోలేని దెబ్బగా మారింది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో అజాంఖాన్ జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులు కేవలం జీతం తీసుకునే ఉద్యోగులని, వారికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అదే సమయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రస్తావన తెస్తూ... గతంలో సీనియర్ అధికారులు ఆమె బూట్లను చేతిరుమాళ్లతో తుడిచారని, ప్రస్తుతం తాము ఆమెతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి, అల్లా తలిస్తే ఈ అధికారులతో కూడా ఆమె బూట్లు పాలిష్ చేయిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియోలు అప్పట్లో వైరల్ కావడంతో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద ఆయనపై కేసు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఈరోజు శిక్షను ఖరారు చేసింది.
అజాంఖాన్‌కు ఇలా చట్టపరమైన ఎదురుదెబ్బలు తగలడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది రెండు వేర్వేరు పాన్ కార్డులు కలిగి ఉన్నారనే ఫోర్జరీ కేసులో అజాంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా అజాంఖాన్‌లకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా గత నెలలో రాంపూర్ సెషన్స్ కోర్టు కొట్టివేయడం గమనార్హం.