మాఫియాలో చేరాలని ప్లాన్.. తల్లిని కిరాతకంగా చంపిన బాలుడు

Rajam Teen Kills Mother Spandana Plans to Join Mumbai Mafia
  • క్రమశిక్షణ పేరుతో ఆంక్షలు పెడుతోందని కన్నతల్లిని హత్య చేసిన కొడుకు
  • స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం దారుణానికి ఒడిగట్టిన 16 ఏళ్ల బాలుడు
  • హత్య తర్వాత బంగారం, నగదుతో ముంబై వెళ్లి మాఫియాలో చేరాలని ప్లాన్
  • సాంకేతిక ఆధారాలతో నిందితులను తిరుపతిలో పట్టుకున్న పోలీసులు
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే ఆ తల్లి పాలిట యముడయ్యాడు. క్రమశిక్షణతో మెలగమని చెప్పిన మాటలే అతనికి నచ్చలేదు. కన్నతల్లి పెట్టిన ఆంక్షలను భరించలేక స్నేహితుడితో కలిసి కిరాతకంగా హతమార్చాడు. సభ్యసమాజాన్ని నివ్వెరపరిచే ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో చోటుచేసుకుంది.

రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటకు చెందిన ముంజేటి స్పందన(34)కు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. కొడుకు చెడుదోవ పడతాడనే భయంతో స్పందన అతడిపై తరచూ ఆంక్షలు విధిస్తూ కఠినంగా వ్యవహరించేవారు. ఇదే సమయంలో తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తల్లికి చెప్పగా, ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తల్లిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆ బాలుడు నిర్ణయించుకున్నాడు.

ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పి, ఇద్దరూ కలిసి హత్యకు పథకం రచించారు. మే 4న పథకం ప్రకారం తన స్నేహితుడిని ఇంటికి పిలిపించాడు. ఆ సమయంలో ఇంట్లో లేని తల్లికి ఫోన్ చేసి రప్పించాడు. తల్లి ఇంటికి రాగానే బాత్రూమ్‌కు వెళ్తుందని ఊహించి, అక్కడే స్నేహితుడిని మాటు వేయమని సూచించాడు. స్పందన బాత్రూమ్‌లోకి వెళ్లగానే ఆమె స్నేహితుడు గట్టిగా పట్టుకోగా, ఇద్దరూ కలిసి రెండు చాకులతో ఆమె శరీరంపై సుమారు 15 సార్లు విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశారు.

అనంతరం బాత్రూమ్‌లోని రక్తపు మరకలను శుభ్రం చేసి, మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న చెరువు వద్ద ముళ్లపొదల్లో పడేశారు. ఇంట్లోని 9.5 తులాల బంగారం, రూ. 5 వేల నగదు, తల్లి మొబైల్ ఫోన్‌తో పరారయ్యారు. ముంబై వెళ్లి మాఫియాలో చేరాలనే లక్ష్యంతో ముందుగా పలాస చేరుకుని, అక్కడి నుంచి ముంబై వెళ్లారు.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, స్పందన శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో హత్యగా నిర్ధారించారు. కొడుకు అదృశ్యం కావడంతో అతనిపై అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులతో మాట్లాడటాన్ని సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. వారు ముంబైలో ఉన్నట్లు నిర్ధారించుకుని స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, అక్కడి నుంచి తప్పించుకుని వారు తిరుపతి చేరుకున్నారు. వారి కదలికలను నిరంతరం గమనిస్తున్న రాజాం పోలీసులు, తిరుపతి పోలీసుల సహకారంతో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, శ్రీకాకుళంలోని జువైనల్ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు డీఎస్పీ రాఘవులు మీడియాకు వెల్లడించారు.
Go Back to Shorts
Munjetti Spandana
Spandana murder
rajam crime
vizianagaram district
matricide
minor arrested
mumbai mafia
crime news telugu
Andhra Pradesh crime
teenage crime

More Telugu News