మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. పాక్ కెప్టెన్ ఫాతిమా ప్రపంచ రికార్డ్

Fatima Sana sets new record in womens cricket
  • 15 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు
  • 18 బంతుల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన ఫాతిమా
  • ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచిన పాక్ కెప్టెన్
  • ఫాతిమా మెరుపులతో పాకిస్థాన్ 223 పరుగుల భారీ స్కోరు
పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా సరికొత్త చరిత్ర సృష్టించింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్ రికార్డు పుస్తకాలను తిరగరాసింది. మహిళల టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన క్రీడాకారిణిగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఫాతిమా కేవలం 15 బంతుల్లోనే ఈ అద్భుతమైన మైలురాయిని అందుకుంది.

జింబాబ్వేతో కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 17వ ఓవర్ ముగిసేసరికి 152 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఫాతిమా సనా.. జింబాబ్వే బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఎదుర్కొన్న ప్రతీ బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా నోమ్వెలో సిబండా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 4, 4, 6, 6, 4 బాది ఏకంగా 24 పరుగులు పిండుకుంది. దీంతో ఆమె 14 బంతుల్లోనే 48 పరుగులకు చేరుకుంది. ఆఖరి ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు తీసి తన చారిత్రక హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది.

ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అంతకుముందు 18 బంతుల్లో అర్ధ శతకాలు సాధించిన సోఫీ డెవిన్, ఫోబీ లిచ్‌ఫీల్డ్, రిచా ఘోష్‌ల రికార్డును ఫాతిమా బద్దలు కొట్టింది. అంతేకాకుండా, మహిళల టీ20 క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు కలిపి) వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును కూడా సమం చేసింది. చివరకు 19 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫాతిమా మెరుపులతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది మహిళల టీ20ల్లో పాకిస్థాన్‌కు రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.

ఈ ఏడాది ఫాతిమా సనా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది ఆడిన 5 టీ20 ఇన్నింగ్స్‌లలో 206.30 స్ట్రైక్ రేట్‌తో 229 పరుగులు చేసి పాక్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై 41 బంతుల్లో 90 పరుగులు చేసి తన అత్యధిక స్కోరును నమోదు చేసుకుంది. తాజా ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ తరఫున 20 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన నిదా దార్ రికార్డును కూడా ఆమె అధిగమించింది.
Go Back to Shorts
Fatima Sana
Pakistan women cricket
womens T20 record
fastest fifty
Sophie Devine
womens cricket
Zimbabwe
Karachi
cricket record

More Telugu News