పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ మోడ్ లో మహానాడు: పల్లా శ్రీనివాసరావు

  • ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు
  • ఆయిల్ సంక్షోభం, పొదుపు చర్యల కారణంగా నిర్ణయం
  • మినీ, పార్లమెంటరీ స్థాయి మహానాడులు రద్దు
  • మంగళగిరిలో ముఖ్య నేతలు, క్లస్టర్లలో కార్యకర్తలు
  • 1848 కేంద్రాల్లో స్క్రీన్ల ద్వారా వీక్షించే ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే 'మహానాడు' పండుగను ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పశ్చిమాసియా యుద్ధం, దేశంలో నెలకొన్న చమురు సంక్షోభం (ఆయిల్ క్రైసిస్) కారణంగా పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు తెలిపారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మే 27, 28 తేదీల్లో మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో జరపనున్నట్లు పల్లా శ్రీనివాస రావు వివరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలిపారు. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్లస్టర్ల వద్ద ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్ వద్ద సుమారు 500 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ పొదుపు చర్యల్లో భాగంగా, మే 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన మినీ మహానాడులతో పాటు, 23, 24 తేదీల్లోని పార్లమెంట్ స్థాయి మహానాడులను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నాయకులు, కార్యకర్తలు స్వాగతించాలని కోరారు.



Palla Srinivasa Rao
Mahanadu
TDP
Telugu Desam Party
Nara Chandrababu Naidu
Hybrid Mode
Oil Crisis
Andhra Pradesh Politics

More Telugu News