లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే!

Fuel Price Hike Reasons Explained
  • దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు
  • ఇరాన్ సంక్షోభంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 114 డాల‌ర్ల‌కు చేరడమే ప్రధాన కారణం
  • రికార్డు స్థాయికి పతనమైన రూపాయి విలువ ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం
  • 10 వారాల్లో రూ.లక్ష కోట్లకు పైగా నష్టాలు చవిచూసిన చమురు సంస్థలు
  • ఇప్పటికే ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం
దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దాదాపు 10 వారాల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను నేడు ఒక్కసారిగా పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని తెలిసినా, మోదీ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అసలు ఈ పెంపునకు దారితీసిన బలమైన కారణాలేమిటో వివరంగా పరిశీలిద్దాం.

అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు
ఇరాన్‌లో కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచ ముడి చమురు సరఫరా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ సంక్షోభానికి ముందు భారత క్రూడ్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు సుమారు 69 డాలర్లు ఉండగా, ఆ తర్వాత అది 113-114 డాలర్లకు చేరింది. భారత్ తన అవసరాల్లో దాదాపు 85శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందున, ఈ పెరుగుదల దిగుమతి బిల్లుపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు రవాణా, బీమా ఖర్చులు కూడా పెరగడం అదనపు భారంగా మారింది.

డబుల్ దెబ్బ: ముడి చమురు ధర పెరగడం.. రూపాయి పతనం
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురును అమెరికా డాలర్లలో కొనుగోలు చేస్తారు. ఇటీవల రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 95.95కు పడిపోయింది. రూపాయి బలహీనపడటంతో అదే బ్యారెల్ చమురుకు భారత్ మరింత ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఒకవైపు ముడి చమురు ధర పెరగడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం ఆర్థిక వ్యవస్థపై "డబుల్ దెబ్బ"గా పరిణమించింది.

చమురు కంపెనీల భారీ నష్టాలు
గత 10 వారాలుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) పాత ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తూ వచ్చాయి. ముడి చమురు ధర 50 శాతం పెరిగినా, ఆ భారాన్ని ప్రజలపై మోపకుండా అవి నష్టాలను భరించాయి. ఈ క్రమంలో రోజుకు సుమారు రూ.1,600 కోట్ల చొప్పున, 10 వారాల్లో మొత్తం రూ.1 లక్ష కోట్లకు పైగా నష్టపోయాయి. ఏ కంపెనీ కూడా ఇంత భారీ నష్టాలను దీర్ఘకాలం భరించడం అసాధ్యం.

ప్రభుత్వంపై కూడా భారం
ఇప్పటికే ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించింది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుంచి రూ.3కి, డీజిల్‌పై రూ.10 నుంచి సున్నాకు తగ్గించింది. దీనివల్ల ప్రభుత్వానికి నెలకు రూ.14,000 కోట్ల ఆదాయం తగ్గింది. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పడిపోవడం, మరోవైపు చమురు కంపెనీల నష్టాలు పెరిగిపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. అందుకే ధరల పెంపు అనివార్యమైంది.

చాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లీడ్ అనలిస్ట్ ధవల్ పోపట్ మాట్లాడుతూ.. "ఓఎంసీల ఆదాయం ఇంధన మార్కెటింగ్ మార్జిన్‌లపై ఆధారపడి ఉంటుంది. లీటర్‌కు రూ.1 మార్జిన్ పెరిగితే, వాటి ఈబీఐటీడీఏ 12-17% పెరుగుతుంది. ప్రస్తుత పెంపు కొంత ఉపశమనం మాత్రమే. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నంత కాలం మార్కెటింగ్ నష్టాలను భర్తీ చేయడానికి మరిన్ని పెంపులు అవసరం కావచ్చు. ఎల్‌పీజీపై వస్తున్న నష్టాలు కూడా లాభదాయకతపై ప్రభావం చూపుతున్నాయి" అని వివరించారు.

ప్రస్తుతం పెంచిన రూ.3 పెంపు కూడా చమురు కంపెనీల నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేదు. ప‌శ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడి, ముడి చమురు ధరలు తగ్గితే తప్ప ఇంధన ధరల భారం నుంచి పూర్తి ఉపశమనం లభించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Fuel Price Hike
Crude Oil Prices
Petrol Diesel Prices
Indian Oil Corporation
Rupee Value
Inflation
Excise Duty
Oil Marketing Companies

More Telugu News