వందే భారత్ లో బేరసారాలు.. రూ.380కే టికెట్, టీటీఈ సస్పెండ్.. వీడియో ఇదిగో!

Vande Bharat Ticket Examiner Suspended for Offering Discount
  • వందే భారత్ లో తక్కువ ధరకు టికెట్ ఇస్తానన్న టీటీఈ
  • ప్రయాణికుడితో బేరసారాలను వీడియో తీసి పోస్ట్ చేసిన ప్యాసింజర్
  • రూ.700 టికెట్ ను రూ.380కి ఇస్తానని ఆఫర్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. టీటీఈపై సస్పెన్షన్ వేటు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి తక్కువ ధరకే టికెట్ ఇస్తానని చెప్పిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)పై భారతీయ రైల్వే శాఖ వేటు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. 

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈ వీడియోలో.. టీటీఈ ఓ ప్రయాణికుడితో టికెట్ గురించి మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇది కుదరదని చెబుతూనే రూ.380 చెల్లిస్తే తాను టికెట్ ఏర్పాటు చేస్తానని ఆ టీటీఈ చెప్పడం వినిపిస్తోంది. అదే టికెట్‌ను అధికారికంగా కొనుగోలు చేస్తే సుమారు రూ.700 అవుతుందని ఆయన వివరించారు. ఈ సంభాషణ మొత్తాన్ని ప్రయాణికుడు రహస్యంగా రికార్డు చేశారు.

అనంతరం, 'రూ.750 విలువైన వందే భారత్ టికెట్‌ను టీటీఈ రూ.380కే ఇస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వేగంగా వ్యాపించింది. ఈ వీడియోపై రైల్వే సేవ, డీఆర్‌ఎం దానాపూర్ స్పందించాయి. ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే అధికారులు.. విచారణకు ఆదేశించి, తక్షణమే ఆ టీటీఈని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది అవినీతి అని, అధికారుల హోదాను దుర్వినియోగం చేయడమేనని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ప్రయాణికుడికి సహాయం చేసేందుకే టీటీఈ అలా చేసి ఉండొచ్చని సరదాగా కామెంట్లు పెడుతున్నారు. 
Go Back to Shorts
Vande Bharat
Vande Bharat Express
TTE Suspended
Indian Railways
Ticket Examiner
Corruption
Viral Video
Danapur DRM
Railway Service

More Telugu News