మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు

Kalvakuntla Kavitha Announces Telangana Rakshana Sena Flag Festivals
  • నెల రోజుల పాటు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగలు
  • రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు జెండా పండుగ
  • పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జెండా పండుగ
తమ పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు నెల రోజుల పాటు వాడవాడలా జెండా పండుగలు నిర్వహించనున్నట్లు కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ప్రకటించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మే 20 నుండి జూన్ 20 వరకు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహిస్తామని తెలిపింది.

పార్టీ ఆవిర్భావ సభలో తెలిపిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వివరిస్తారని వెల్లడించింది. నేడు తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎక్కడికక్కడ గళమెత్తవలసిందిగా పార్టీ నాయకులను కార్యకర్తలకు ఇప్పటికే సూచించినట్లు తెలిపింది. అందులో భాగంగా రాష్ట్రస్థాయి అంశాలతో పాటు స్థానిక సమస్యల పట్ల కూడా అక్కడి శ్రేణులు స్పందించడం, అవసరమైనచోట పోరాటానికి సిద్ధంగా ఉంటారని తెలిపింది.

టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా కార్యకర్తలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాలని పిలుపునిచ్చింది. కలిసి వచ్చే వారిలో సమాజం పట్ల బాధ్యత, అంకితభావం కలిగిన చురుకైన కార్యకర్తలతో సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. రాజకీయ చైతన్యం నిండిన ఒక బలమైన జన సమూహాన్ని ప్రజా ఉద్యమాల కోసం నిర్మిద్దామని పిలుపునిచ్చింది.
Go Back to Shorts
Kalvakuntla Kavitha
Telangana Rakshana Sena
TRS Flag Festival
TRS Party
Telangana Politics

More Telugu News