మోదీ పెద్ద మనసు కలవారని వాళ్లు చెబుతుంటారు... ఆ పెద్ద మనసుతో సహకరించండి: మోదీకి రేవంత్ విజ్ఞప్తి

Revanth Reddy Requests Modi to Support Telangana with Big Heart
  • తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి వినతి
  • గుజరాత్ మోడల్ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ సహకరించినట్టే తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి
  • 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని హామీ
  • రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించాలని మనవి
తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి హిందీలో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు. దేశాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేస్తూనే, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ప్రధాని ముందుంచారు.

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడూ మోదీ చాలా పెద్ద మనసున్న వారని చెబుతుంటారు, ఆ పెద్ద మనసుతో తెలంగాణ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మోదీని రేవంత్ కోరారు. దేశ ప్రగతికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేయబోమని, వికసిత్ భారత్ నిర్మాణంలో తెలంగాణను భాగస్వామిని చేస్తామని ఆయన ప్రధానికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం కేవలం కేంద్ర ప్రభుత్వానిది కాదని, ఇది తెలంగాణ అభివృద్ధి ఉత్సవమని రేవంత్ రెడ్డి అన్నారు. "ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని ప్రకటించిన రోజే, దానికి అనుగుణంగా మేం 'తెలంగాణ రైజింగ్ 2047' పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. దేశాన్ని 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న మీ కలను సాకారం చేయడంలో తెలంగాణ 10% వాటాను అందిస్తుంది. దేశ జనాభాలో 3% కంటే తక్కువ ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో 5% వాటాను తెలంగాణ అందిస్తోంది. రానున్న రోజుల్లో దీన్ని 10 శాతానికి పెంచడమే మా లక్ష్యం" అని వివరించారు.

ఈ లక్ష్య సాధన కోసం ఒక ఆసక్తికరమైన పోలికను ప్రధాని ముందుంచారు. "గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు మీ 'గుజరాత్ మోడల్'కు ఆయన సహకరించారు. ఇప్పుడు మీరు ప్రధానిగా ఉండగా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. రాష్ట్ర ప్రజలు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రానున్న పదేళ్లలో 'తెలంగాణ మోడల్' నిర్మించి, 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి మీ ఆశీస్సులు, సహకారం ఎంతో అవసరం" అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

దేశానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలు గ్రోత్ ఇంజన్ల వంటివని, ఈ నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ నగరాల నుంచి వచ్చే అభివృద్ధి ప్రతిపాదనలకు సత్వరమే అనుమతులు ఇచ్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ లేదా సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణకు అత్యంత కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం పోర్టు మధ్య 12 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే, రైల్వే లైన్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను సీఎం రేవంత్ ప్రస్తావించారు. "ఈ ప్రాజెక్టులపై చర్చించేందుకు తెలంగాణ కోసం ఒక రెండు గంటల సమయం కేటాయించి ప్రత్యేక సమీక్ష నిర్వహించండి. మా ప్రతిపాదనలన్నింటినీ మీ ముందు ఉంచుతాం" అని కోరారు. 

Go Back to Shorts
Revanth Reddy
Telangana
Narendra Modi
Telangana development
Regional Ring Road
Hyderabad Metro
Musi River
Telangana Rising 2047
Vikshit Bharat 2047
Telangana economy

More Telugu News