బెంగాల్ లో బీజేపీ ఘన విజయం.. వీధుల నుంచి విమానాలకు పాకిన 'జై శ్రీరాం' నినాదాలు
- ఇండిగో విమానంలో జై శ్రీరామ్, హర హర మహాదేవ్ నినాదాలు చేసిన ప్రయాణికుడు
- ఆ నినాదాలను అందుకున్న తోటి ప్రయాణికులు
- దీన్ని ప్రజస్వామ్య విజయోత్సవంగా అభివర్ణిస్తున్న ఓ వర్గం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత, ఆ వేడుకలు కేవలం వీధుల్లోనే కాకుండా విమానాల్లో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణికులు ఉత్సాహంగా మతపరమైన, రాజకీయపరమైన నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఒక ప్రయాణికుడు విమానంలో 'జై శ్రీరామ్', 'హర హర మహాదేవ్', 'జై బెంగాల్', 'జై దుర్గా', 'భారత్ మాతాకి జై' అంటూ నినాదాలు చేయగా... అతని చుట్టూ ఉన్న తోటి ప్రయాణికులు కూడా నవ్వుతూ, ఉత్సాహంగా ఆ నినాదాలను అందుకోవడం వీడియోలో కనిపిస్తోంది. మే 4న వెలువడిన ఫలితాల్లో 294 స్థానాలకు గాను బీజేపీ 207 సీట్లను గెలుచుకుని మెజారిటీ మార్కును దాటగా, 2011 నుండి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ భారీ రాజకీయ మార్పు నేపథ్యంలో విమానంలో కనిపించిన ఈ ఉత్సాహపూరిత వాతావరణం ఎన్నికల ఫలితాల తాలూకు ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది.
అయితే, ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం దీనిని ప్రజాస్వామ్య విజయోత్సవంగా, సహజమైన వేడుకగా అభివర్ణిస్తుండగా, మరికొందరు దీనిని తప్పుబడుతున్నారు. విమానం వంటి పరిమిత ప్రజా రవాణా ప్రదేశాల్లో ఇటువంటి రాజకీయ లేదా మతపరమైన నినాదాలు చేయడం ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవచ్చని, ఇది భిన్న భావజాలాలు కలిగిన వారి మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ వ్యక్తీకరణలకు ఒక పరిమితి ఉండాలని వారు సూచిస్తున్నారు.
మరోవైపు, ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. భారీ మెజారిటీతో విజయం నమోదైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దహనకాండలు, ఆస్తుల ధ్వంసం, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన ఈ అతిపెద్ద మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.