ఢిల్లీలో కూడా ఇలాగే గెలిచారు: బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై స్పందించిన కేజ్రీవాల్

Arvind Kejriwal Reacts to BJP Win in Bengal Like Delhi
  • మోదీ వేవ్ ఉన్నప్పుడే ఢిల్లీ, బెంగాల్‌లో బీజేపీ గెలవలేకపోయిందన్న కేజ్రీవాల్
  • మోదీకి ప్రజాదరణ తగ్గుతున్న సమయంలో ఎలా గెలిచిందని ప్రశ్న
  • ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆగ్రహం
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించడంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ తర్వాత, బెంగాల్‌లో కమలం పార్టీ విజయంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాదరణ తగ్గుతున్న సమయంలో బీజేపీ బెంగాల్‌లోకి ఎలా ప్రవేశించిందో చెప్పాలని నిలదీశారు.

మోదీ వేవ్ బాగా ఉన్న సమయంలోనూ ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలలో బీజేపీ గెలవలేకపోయిందని అన్నారు. 2015లో ఢిల్లీలో, 2016లో బెంగాల్‌లో బీజేపీకి మూడు సీట్ల చొప్పున మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. కానీ మోదీ ప్రజాదరణ అట్టడుగు స్థాయికి పడిపోయిన ప్రస్తుత సమయంలో అవే ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలలో ఎలా గెలిచిందో చెప్పాలని అన్నారు.

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. మన దేశం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2025 ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటమిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచేందుకు 'ఓట్ల తొలగింపు' అనే వ్యూహాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. 2025లో ఢిల్లీలో, ఇప్పుడు బెంగాల్‌లో జరిగింది ఇదే అని తెలిపారు.

తాను జైలుకు వెళ్లకముందు తన నియోజకవర్గంలో 1.48 లక్షల ఓట్లు ఉండేవని, తాను తిరిగి వచ్చేసరికి అవి 1.06 లక్షలకు పడిపోయాయని తెలిపారు. కేవలం ఆరు నెలల్లో 42 వేల ఓట్లను తొలగించారని మండిపడ్డారు. అంతకుముందు ఎన్నికల్లో తాను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచానని, కానీ ఓట్ల తొలగింపు తర్వాత మూడు వేల ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చిందని అన్నారు.  మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని హెచ్చరించారు.
Go Back to Shorts
Arvind Kejriwal
West Bengal BJP victory
Delhi election
Aam Aadmi Party
Narendra Modi popularity

More Telugu News