బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంతస్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్!
- ఐపీఎల్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు నష్టపోయి యువ ప్రాపర్టీ డీలర్ ఆత్మహత్య
- లక్నోలో 11వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణం
- భార్యకు ఫోన్ చేసి ఏడుస్తూ తన నష్టం గురించి చెప్పిన రియల్టర్
- "బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నందుకే ఆత్మహత్య" అని సూసైడ్ నోట్
- సెషన్ బెట్టింగ్‌లో నష్టపోయినట్టు గుర్తింపు.. బెట్టింగ్ నెట్‌వర్క్‌పై పోలీసుల దృష్టి
గురువారం రాత్రి 9 గంటల సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా ఈ విషాదం జరిగింది. మ్యాచ్ చూస్తూ బెట్టింగ్‌లో అతను తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా మ్యాచ్‌లో ప్రతి బంతికి, ప్రతి ఓవర్‌కు పందాలు కాసే "సెషన్ బెట్టింగ్"లో పాల్గొని భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఘటనా స్థలంలో అతను రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "ఐపీఎల్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నందున ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని హిందీలో రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది నిమిషాల ముందు, పుట్టింట్లో ఉన్న తన భార్యకు అతను ఫోన్ చేశాడు. ఫోన్‌లో ఏడుస్తూ, "నేను చాలా నష్టపోయాను" అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసినట్లు భార్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఎంత ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. ఇంతలో అపార్ట్‌మెంట్ వాసులు పెద్ద శబ్దం విని బయటకు వచ్చి చూడగా, అతను తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది.
ఘాజీపూర్ ఏసీపీ అనింద్య విక్రమ్ సింగ్ మాట్లాడుతూ... సూసైడ్ నోట్‌లోని చేతిరాతను నిపుణులతో పరీక్షిస్తున్నామని తెలిపారు. అతని బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించి, దీని వెనుక ఏదైనా పెద్ద బెట్టింగ్ నెట్‌వర్క్ హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. గతంలో కూడా మృతుడు వ్యక్తిగతంగా కొన్ని నష్టాలను ఎదుర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు.