ఐపీఎల్‌లో భారీగా పరుగులు... ఇది వ్యాపారమన్న ముత్తయ్య మురళీధరన్

Muttiah Muralitharan says IPL is a business due to high scores
  • ప్రస్తుత సీజన్‌లో సులభంగా నమోదవుతున్న 200 పరుగులు
  • స్పాన్సర్లు, వ్యూయర్‌షిప్ అవసరమన్న మురళీధరన్
  • బ్యాటింగ్‌కు సహకరించేలా పిచ్ ఉంటుందన్న మురళీధరన్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో ఆయా జట్లు 200 పరుగులు సులభంగా నమోదు చేస్తున్నాయి. ఈ స్కోర్లను తదుపరి బ్యాటింగ్ చేసిన జట్లు కూడా ఛేదిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 30సార్లకు పైగా రెండొందల స్కోర్లు నమోదయ్యాయి. ప్రత్యర్థి జట్లు 265, 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. దీనితో బౌలర్లపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. భారీ పరుగులు రావడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ స్పందించాడు. ఐపీఎల్ క్రికెట్ వ్యాపారమని స్పష్టం చేశాడు. స్పాన్సర్లు, వ్యూయర్ షిప్ అవసరమని అభిప్రాయపడ్డాడు. అయితే పరుగులు రావడానికి పిచ్ ప్రధాన కారణమని అన్నాడు.

టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు రాబడుతున్నారని, ఈ పిచ్‌లు బౌలర్లకు అంతగా సహకరించడం లేదని అన్నాడు. వీటికి తోడు బౌండరీ సైజ్‌లు కూడా చిన్నగా ఉండటం వల్ల బౌలర్లకు కష్టంగా మారిందని తెలిపాడు. బౌలింగ్‌కు సహకరించేలా పిచ్‌ను రెడీ చేస్తే ప్రేక్షకులు బోర్ కొడుతుందని చెప్పే ప్రమాదం ఉందని అన్నారు. ఐపీఎల్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉందని పేర్కొన్నాడు.

భారీ మొత్తంలో పరుగులు రావడానికి బౌలర్లను తప్పుపట్టాల్సిన అవసరం లేదని తెలిపాడు. 2020 నుంచి మ్యాచ్‌లు చూస్తున్నవారు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కువగా ఆశిస్తారని పేర్కొన్నాడు. మ్యాచ్ సమయంలో ఫోర్లు, సిక్సులు ఉండాలని కోరుకుంటారని అన్నాడు. అలాంటి వారి కోసమే ఐపీఎల్‌లో చాలా మార్పులు చేసినట్లు చెప్పాడు. ఇంపాక్ట్ రూల్‌తో అదనంగా బ్యాటర్ రావడం వల్ల స్కోర్ బోర్డుపై కనీసం 200 మార్క్ కనిపిస్తోందని తెలిపాడు.

ఈ మెగా లీగ్ ఆవిర్భావం వెనుక చాలా అంశాలు ఉంటాయని అన్నాడు. క్రికెట్‌ను అభివృద్ధి చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ విషయం కాదని అన్నాడు. క్రికెటర్లకు అవకాశాలు వస్తున్నాయని, అలాగే, అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పెద్ద వ్యాపారమని అంగీకరించాడు. ఇక్కడ స్పాన్సర్లే కీలకమని తెలిపాడు. మ్యాచ్‌లో విసుగు తెప్పిస్తే ప్రజలు చూడరని, అప్పుడు స్పాన్సర్లను, వ్యూయర్ షిప్‌ను కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.
Go Back to Shorts
Muttiah Muralitharan
IPL
Indian Premier League
IPL 2024
Cricket
T20
Sunrisers Hyderabad

More Telugu News