ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది?: షర్మిల

YS Sharmila fires on AP Govt over fuel shortage in state
  • ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల
  • రూ.500 డీజిల్ కోసం ఆక్వా రైతు పడిన ఆవేదనను ప్రస్తావించిన వైనం
  • ఇది రైతును రక్షించే ప్రభుత్వమా, భక్షించే ప్రభుత్వమా అని ప్రశ్న
  • మోదీకి తొత్తుగా ఉంటూ చంద్రబాబు బీజేపీ భజన చేస్తున్నారని విమర్శ
  • వదంతులు నమ్మొద్దని చెప్పడం కాదు.. కళ్లు తెరవాలని చంద్రబాబుకు హితవు
రాష్ట్రంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడిందంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.500 డీజిల్ కోసం ఓ ఆక్వా రైతు పడిన ఆవేదనను ప్రస్తావిస్తూ, ఇది రైతులను రక్షించే ప్రభుత్వమా లేక భక్షించే ప్రభుత్వమా అని ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఇది వారి పాలిట శాపంగా పరిణమించిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ రైతు ఆక్రోశిస్తున్న ఓ వీడియో పంచుకున్నారు. 

"కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపం. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం రొయ్య రైతులకు అంతులేని కష్టం. కంటికి రెప్పలా చూసుకొనే రొయ్య పిల్లలను బ్రతికించేందుకు ఓ పెట్రోల్ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదన వర్ణనాతీతం. రూ. 500 డీజిల్ కోసం ఆ రైతు రోదించిన తీరు చూసి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. 

"అన్నా నాకు ఫ్యాన్ సీట్లు (ఏరేటర్) తిరగాలన్నా .. అప్పుచేసి రొయ్య పిల్ల వేశాను.. ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోద్ది అన్న" రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? చంద్రబాబు గారి ఛాతిలో ఉన్నది గుండెనా? బండనా? ఇది రైతన్నను రక్షించే ప్రభుత్వమా? భక్షించే ప్రభుత్వమా? ఇదేనా చంద్రబాబు గారి విజినరీ? దీన్నే అంటారా అద్భుతమైన గుడ్ గవర్నెన్స్?

రైతులతో కాళ్లు పట్టించుకున్న పాపం ఈ కూటమి ప్రభుత్వానికి తగలకపోదు. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకొచ్చింది ? ఎన్డీయే పాలిత రాష్ట్రంలో ఇంధనం కోసం ప్రజల పడిగాపులా? పెట్రోల్ బంకుల దగ్గర మల్లయుద్ధాలా? రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ పోయడమా? సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3 వేల బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఇవ్వాళ్టికి ఎందుకున్నాయి? ఇదేనా రాష్ట్ర ప్రజలపై కేంద్రానికున్న చిత్తశుద్ధి? ఇందుకేనా పడి పడి మోదీజీకి మద్దతు ఇచ్చేది? 

బంకుల దగ్గర జనాలు అవస్థలు పడుతుంటే, ప్రత్యక్షంగా అన్నీ రంగాలపై ఇంధన సంక్షోభం తీవ్ర పరిణామాలు చూపిస్తుంటే, ఇంకా బీజేపీ భజన చేయడానికి, మోదీగారి తొత్తుగా ఉండటానికి చంద్రబాబు గారు సిగ్గుపడాలి. రాష్ట్రంపై బీజేపీకి పట్టింపు లేదనడానికి ఇంధన సంక్షోభం ఒక నిదర్శనం. వదంతులు నమ్మొద్దని చెప్పే బదులు... ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబు గారు" అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Go Back to Shorts
YS Sharmila
Fuel Shortage
Chandrababu
NDA
TDP
Janasena
BJP
Congress
APCC
Andhra Pradesh

More Telugu News