బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 'ఎక్స్' వేదికగా కేటీఆర్, హరీశ్ రావు ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 'ఎక్స్' వేదికగా కేటీఆర్, హరీశ్ రావు ట్వీట్

KTR Comments on BRS Formation Day
  • బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవమన్న కేటీఆర్
  • నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని వ్యాఖ్య
  • తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిందన్న హరీశ్ రావు
బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదని, ఇది ఒక విప్లవమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయన 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా ఈరోజుతో పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని తెలిపారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ
సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం ఇది అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అని తెలిపారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిన ప్రపంచానికి అందించింది: హరీశ్ రావు

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కవితారూపంలో పార్టీ గురించి ట్వీట్ చేశారు.

"నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,
సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక,
పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక,
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ రాసుకొచ్చారు.

పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో 'రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి' అనే నినాదం మార్మోగుతుందని పేర్కొన్నారు. సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో అదే నినాదం వినిపిస్తోందని అన్నారు.

ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తియే బీఆర్ఎస్ అన్నారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని హరీశ్ రావు పేర్కొన్నారు.
Advertisement
KTR
BRS Formation Day
BRS Party
Telangana
Harish Rao
Revanth Reddy
Telangana Politics

More Telugu News