చంద్రబాబుపై పాత జోకులు.. కమెడియన్ షోలో రచ్చ.. స్టేజ్‌పైనే క్షమాపణ

Chandrababu Naidu Jokes Disrupt Comedian Sharath Udays Show
  • బెంగళూరులో హైదరాబాద్ కమెడియన్ శరత్ ఉదయ్ షోలో గందరగోళం
  • సీఎం చంద్రబాబుపై రెండేళ్ల క్రితం చేసిన జోకులపై టీడీపీ మద్దతుదారుల అభ్యంతరం
  • వేదికపైనే కమెడియన్‌తో బలవంతంగా క్షమాపణ చెప్పించిన నిరసనకారులు
  • ఇలాంటి చర్యలను ప్రోత్సహించబోమన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
  • కళాకారులు హద్దులు మీరితే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనకు బెంగళూరులో అంతరాయం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాదాపు రెండేళ్ల క్రితం చేసిన కొన్ని వ్యంగ్యాస్త్రాలకు నిరసనగా, టీడీపీ మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు శనివారం ఆయన షోను అడ్డుకున్నారు. బెంగళూరులోని కోరమంగళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శరత్ ఉదయ్ తన ప్రదర్శన ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ గందరగోళం మొదలైంది. ప్రేక్షకుల్లో నుంచి ఒక వ్యక్తి వేదిక వద్దకు వచ్చి తాను ఆయన అభిమానినని చెబుతూనే చంద్రబాబుపై గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. వెంటనే మరికొందరు అతడితో జతకలిశారు. ఆ బృందం శరత్ ఉదయ్‌పై దూషణలకు దిగడమే కాకుండా, దాడి చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. ముఖ్యంగా 2003లో చంద్రబాబుపై నక్సలైట్లు జరిపిన హత్యాయత్నం గురించి చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఇలాంటి జోకులు వేయవద్దని తీవ్రంగా హెచ్చరించారు.

టీడీపీ నేతల గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడవద్దని, పార్టీ నేతలకు అనుకూలంగా నినాదాలు చేయాలని వారు బలవంతం చేయబోగా శరత్ ఉదయ్ నిరాకరించారు. తన కామెడీలో కేవలం టీడీపీ మాత్రమే కాకుండా, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రస్తావన కూడా ఉంటుందని ఆయన వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వారు వేదికపైనే శరత్ ఉదయ్‌తో బలవంతంగా క్షమాపణ చెప్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆ బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఘటనను ఖండించిన టీడీపీ.. హెచ్చరిక
ఈ ఘటనపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నిరసనలను, దాడులను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని, భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా జరిగే ఏ చర్యనూ సమర్థించబోమని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఇదే సమయంలో స్టాండప్ కమెడియన్లు, కళాకారులు, రాజకీయ విశ్లేషకులకు ఆయన ఓ హెచ్చరిక జారీ చేశారు. సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. "ప్రముఖులపై వివాదాస్పద లేదా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ద్వారా తక్షణమే గుర్తింపు పొందవచ్చని కొందరు అనుకుంటున్నారు. కానీ అది పూర్తిగా తప్పు" అని పల్లా వ్యాఖ్యానించారు.

గతంలో రాష్ట్రంలోని అధికార కూటమి నాయకులపై వ్యాఖ్యలు చేసినందుకు స్టాండప్ కమెడియన్లు అనుదీప్ కటికల, రఫీక్ మహమ్మద్‌లను ఏపీ పోలీసులు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Chandrababu Naidu
Sharath Uday
TDP
Andhra Pradesh
Standup Comedy
Palla Srinivasa Rao
Comedy Show Controversy
Naxalite Attack
Freedom of Speech
Bengaluru

More Telugu News