భారతీయులు భలే మంచివాళ్లు.. ఎవరి జోలికి వెళ్లరు: అమెరికన్ సీఈఓ ప్రశంసలు
- H-1B వీసాపై పనిచేస్తున్న భారతీయులపై టెక్సాస్ వ్యాపారవేత్త ప్రశంసలు
- భారతీయులు నేరాలు చేయరని, వారి వల్లే ఫ్రిస్కో నగరం సురక్షితంగా ఉందని వ్యాఖ్య
- ట్రంప్ మద్దతుదారు అయినప్పటికీ భారతీయ నిపుణులను వెనకేసుకొచ్చిన వ్యాపారవేత్త
- భారతీయులను వెనక్కి పంపితే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరిక
టెక్సాస్‌కు చెందిన పారిశ్రామికవేత్త, 'హార్డ్‌కోర్ క్లోజర్' బ్రాండ్ అధినేత ర్యాన్ స్ట్యూమన్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. తాను డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారునని, 'అమెరికా ఫస్ట్' విధానాన్ని సమర్థిస్తానని చెబుతూనే, గతంలో H-1B వీసా కార్యక్రమంపై తనకు సందేహాలు ఉండేవని అంగీకరించారు. అయితే, ఫ్రిస్కోలో నివసించే భారతీయులు దాదాపుగా ఎలాంటి నేరాలకు పాల్పడరని, ఎవరితోనూ గొడవలకు దిగరని ఆయన పేర్కొన్నారు.
"భారత నిపుణులు అధిక వేతనాలు పొందుతూ, ఇళ్లు కొనుగోలు చేస్తూ, పన్నులు కడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. వారిని వెనక్కి పంపితే ఆ స్థానంలోకి వచ్చే తక్కువ ఆదాయ వర్గాల వల్ల నేరాలు పెరిగే ప్రమాదం ఉంది," అని స్ట్యూమన్ హెచ్చరించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో చదివేందుకు చాలా మంది అమెరికన్లు ఆసక్తి చూపడం లేదని, ఆ ఖాళీని H-1B ఉద్యోగులు భర్తీ చేస్తున్నారని వివరించారు.
ట్రంప్ హయాంలో H-1B వీసా నిబంధనలు కఠినతరం కావడం, టెక్ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు వంటి పరిణామాల నేపథ్యంలో స్ట్యూమన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. వలసదారుల వల్ల నేరాలు తక్కువగా ఉన్నాయని టెక్సాస్ రాష్ట్ర గణాంకాలు కూడా చెబుతున్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.