గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రాబోతున్న 'పెద్ది' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రామ్ చరణ్‌తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను ఆయన పంచుకున్నారు.

ఈ ఫోటోలలో రామ్ చరణ్, బుచ్చిబాబు ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటోలకు "తుపానుకు ముందు ప్రశాంతత" అని క్యాప్షన్ జోడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాకుండా, "నాకు ఇష్టమైన పోజులో నా ఫేవరెట్ సర్.. లవ్ యూ సర్" అంటూ రామ్ చరణ్‌పై బుచ్చిబాబు తన అభిమానాన్ని చాటుకున్నారు. 

ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన రామ్ చరణ్, తొలి సినిమా 'ఉప్పెన'తోనే బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. సినిమా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.