ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. సాక్షులను బెదిరించిన ఆరోపణలపై నిన్న అరెస్టయిన ఆయనకు ఈ ఉదయం కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ఈరోజు కాకినాడ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 


కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మరోవైపు నిన్న రాత్రంతా అనంతబాబును సర్పవరం పోలీసులు విచారించారు. విచారణలో పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన 30 ప్రశ్నలకు గాను కేవలం 6 ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రశ్నలకు ఆయన స్పందించలేదు.