చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి: కాకాణి
- సీమ నీటి హక్కుల కోసం వైసీపీ పోరాటానికి సిద్ధమవుతోందన్న కాకాణి
- సీమ ప్రాజెక్టులను చంద్రబాబు గాలికి వదిలేశారని మండిపాటు
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శ
రాయలసీమ నీటి హక్కుల కోసం వైసీపీ పోరాటానికి సిద్ధమవుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం సీమ ప్రాజెక్టులను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ముందుచూపుతో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చంద్రబాబు అడ్డుకున్నారని, దీనివల్ల సీమ రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, అందుకే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బాబు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల పేరు చెప్పుకుని 'నీరు-చెట్టు' పథకం ద్వారా గతంలో టీడీపీ నేతలు దోచుకున్నారని, ఇప్పుడూ అదే బాటలో సాగుతున్నారని విమర్శించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పే చంద్రబాబు మెడలు వంచి ప్రాజెక్టులను సాధించుకుందామని, అందుకు రైతులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.