భీమ్ యాప్‌లో కొత్త ఫీచర్... ఇకపై సిబిల్ స్కోర్ కూడా చూసుకోవచ్చు!

NPCI backed BHIM app users can now check credit scores in new version
భీమ్ యాప్‌లో అందుబాటులోకి సిబిల్ స్కోర్ ఫీచర్
ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌తో ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ ఒప్పందం
యూజర్ల అనుమతితోనే వారి క్రెడిట్ సమాచారం వెల్లడి
ఆర్థిక అవగాహన పెంచడమే ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యం
భీమ్ యాప్ 4.0.19, ఆపై వెర్షన్లలో ఈ సేవలు లభ్యం
భారత్ సొంత యూపీఐ పేమెంట్స్ యాప్ అయిన భీమ్ (BHIM), తన వినియోగదారులకు ఓ కీలకమైన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రోజువారీ లావాదేవీలతో పాటు తమ క్రెడిట్ స్కోర్‌ను కూడా నేరుగా యాప్‌లోనే చూసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు చెందిన భీమ్ సర్వీసెస్ లిమిటెడ్, ప్రముఖ క్రెడిట్ బ్యూరో అయిన ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌తో చేతులు కలిపింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ సిబిల్ స్కోర్‌తో పాటు పూర్తి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను కూడా భీమ్ యాప్‌లోనే పొందవచ్చు. అయితే, యూజర్ల భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారి స్పష్టమైన అనుమతి తీసుకున్న తర్వాతే క్రెడిట్ సమాచారాన్ని అందిస్తారు. భీమ్ యాప్ వెర్షన్ 4.0.19, ఆపై వెర్షన్లు వాడుతున్న వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. కేవలం నగదు బదిలీలకే పరిమితం కాకుండా ప్రజల్లో ఆర్థిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం.

ఈ సందర్భంగా ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండీ, సీఈఓ భవేశ్‌ జైన్ మాట్లాడుతూ... "భారతీయులు క్రెడిట్ విషయంలో కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తున్నారు. ఈ దశలో వినియోగదారుల్లో అవగాహన పెంచడానికి ఈ ఫీచర్ ఒక ముఖ్యమైన ముందడుగు" అని తెలిపారు. యాప్‌లో సరళత, యూజర్ నియంత్రణ అనే ప్రాథమిక సూత్రాలనే ఇప్పుడు క్రెడిట్ సేవలకు కూడా విస్తరిస్తున్నామని ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ లలితా నటరాజ్ వివరించారు.

ఇటీవలే (మార్చి నెలలో) భీమ్ యాప్‌లో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టింది. దీని ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్‌తో పూర్తి చేసే సౌకర్యం కలిగింది. 

కాగా, భారత్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇటీవలే 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్ టైమ్ పేమెంట్స్‌లో 49 శాతం వాటాతో యూపీఐ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి (2026) నెలలోనే యూపీఐ ద్వారా రూ. 28.33 లక్షల కోట్ల విలువైన 21.70 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన భీమ్ యాప్, 15కు పైగా భారతీయ భాషల్లో కోట్లాది మందికి సేవలు అందిస్తోంది.
Go Back to Shorts
BHIM App
NPCI
Credit Scores
CIBIL

More Telugu News