అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి
- అమెరికాలో మరోసారి కాల్పుల మోత
- లూసియానాలో 8 మంది చిన్నారులు మృతి
- పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం
స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. లూసియానా రాష్ట్రం ష్రీవ్‌పోర్ట్ ప్రాంతంలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 1 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న ఎనిమిది మంది చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో కొందరు నిందితుడి బంధువులు కూడా ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
దాడుల తర్వాత నిందితుడు ఓ కారును అపహరించి పారిపోయాడు. పోలీసులు వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా, కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తాము ఎదురుకాల్పులు జరపగా నిందితుడు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.