ఢిల్లీలో కేంద్రమంత్రి విందుకు సీఎం రేవంత్ హాజరు

Revanth Reddy Attends Central Ministers Dinner in Delhi
  • కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ఇచ్చిన అల్పాహార విందుకు సీఎం రేవంత్ హాజరు
  • ఈ భేటీలో పాల్గొన్న  కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని
  • బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రమంత్రులకు రేవంత్ వినతి
  • ఈ భేటీపై రాజకీయంగా చర్చ.. బీఆర్ఎస్ విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇచ్చిన అల్పాహార విందుకు హాజరయ్యారు. కేంద్రమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ భేటీలో కేంద్రమంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ రఘురామకృష్ణరాజు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఆయన దాదాపు గంటపాటు అక్కడే ఉండి, తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సమన్వయం, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం వంటి అంశాలపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

అయితే, ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలకు పలు కీలక విజ్ఞప్తులు చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన బయ్యారం గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌పై వారికి వినతిపత్రం సమర్పించారు. అలాగే, హైదరాబాద్‌కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను త్వరగా అందించాలని, రాష్ట్రంలోని పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు.

ఈ భేటీ కేవలం స్నేహపూర్వకమైనదేనని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాసవర్మ స్పష్టం చేసినప్పటికీ, ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశంపై విమర్శలు గుప్పించింది.

.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
Central Minister
Bhupathiraju Srinivasa Varma
HD Kumaraswamy
Ram Mohan Naidu
Pernmasani Chandrasekhar
Andhra Pradesh
Bayyaram Steel Plant
Delhi

More Telugu News