జర్నలిస్టులు ఉగ్రవాదులా?: సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు

Jagan Alleges Chandrababu Misusing Power Against Critics
  • టీడీపీ ప్రభుత్వం జర్నలిస్టులపై కక్ష సాధిస్తోందని జగన్ ఆరోపణ
  • ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్ర విమర్శ
  • జర్నలిస్టులు పూడి శ్రీహరి, కేవీఆర్‌పై కేసులను ప్రస్తావించిన జగన్
  • ఇది రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమంటూ చంద్రబాబుపై ధ్వజం
  • చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని జగన్ వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, కూటమి ప్రభుత్వంపైనా వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని, ప్రత్యేకంగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దేశద్రోహమా అని నిలదీశారు. ఇది జంగిల్ రాజ్ కాదా అని ఆయన ప్రశ్నించారు.

సీనియర్ జర్నలిస్టులైన పూడి శ్రీహరి, కేవీఆర్‌లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు జగన్ తెలిపారు. "బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి చేసిన తప్పేంటి? అతనిపై అక్రమ కేసులు పెట్టి, ఇంట్లో సోదాలు చేయడానికి అతనేమైనా ఉగ్రవాదా? టెర్రరిస్టా?" అని జగన్ ప్రశ్నించారు. అదేవిధంగా, తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ ఇంట్లో లేని సమయంలో ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమని ఆరోపించారు. పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా అని నిలదీశారు.

గడిచిన రెండేళ్లలో మహిళలు, బాలికలపై జరిగిన ఎన్నో దాడుల ఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం, తమను ప్రశ్నించిన వారిపై మాత్రం వెంటనే కేసులు పెడుతోందని జగన్ విమర్శించారు. "మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసినా వారిపై చర్యలు తీసుకోలేదు. కానీ, వాస్తవాలు మాట్లాడితే మీకు ఎందుకు అంత ఉలుకు?" అని ప్రశ్నించారు.

పౌరులకు రక్షణ కల్పించడంలో విఫలమై, స్వార్థ రాజకీయాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేయడం సుపరిపాలన అవుతుందా అని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ఈ చర్యలకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. "మీరు చేస్తున్న దుర్మార్గాలకు దేవుడు, ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది" అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
YSRCP
Journalists
Pudi Srihari
KVR
Press freedom
Political criticism
Illegal arrests

More Telugu News