ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (38 బంతుల్లో 63) మరోసారి దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ (19), ఫిలిప్ సాల్ట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, కోహ్లీ ఔటైన తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్ నెమ్మదించింది. సాల్ట్ తన దూకుడు కొనసాగించినా, మరో ఎండ్‌లో వికెట్లు పడుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా ఢిల్లీ స్పిన్నర్లు అక్షర్ పటేల్ (2/18), కుల్దీప్ యాదవ్ (2/32) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ పరుగుల వేగానికి కళ్లెం వేశారు. కీలకమైన సాల్ట్ వికెట్‌ను కుల్దీప్ తీయగా, అక్షర్ తన పొదుపైన బౌలింగ్‌తో ఒత్తిడి పెంచాడు. పడిక్కల్ (18), టిమ్ డేవిడ్ (26) కాసేపు మెరిసినా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. జితేశ్ శర్మ (20 బంతుల్లో 14) చాలా నెమ్మదిగా ఆడటం కూడా స్కోరుపై ప్రభావం చూపింది. చివరి ఓవర్లలోనూ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.