ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు అతని జట్టు ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మైదానంలో బుమ్రా అసహనంతో ప్రవర్తించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో బుమ్రా తన బౌలింగ్ మార్కర్‌ను కోపంగా నేలకేసి కొట్టడం, ఆ తర్వాత కిందకు వంగి గట్టిగా అరవడం కనిపిస్తుంది. ఆ సమయంలో ఆర్‌సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ కేవలం 16 బంతుల్లో 34 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో ఆర్‌సీబీ 240 పరుగుల భారీ స్కోరు చేయగా, ముంబై 222 పరుగులకే పరిమితమై ఓడిపోయింది.

ఆ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చినా, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సాధారణంగా ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపించే బుమ్రా ఇలా తీవ్ర అసహనానికి గురవ్వడం చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. వ్యక్తిగత ప్రదర్శన, జట్టు ఓటముల కారణంగా అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, అతని మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.