దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీలు... తొలి స్టేషన్ నిర్మాణం
- అందుబాటులోకి రానున్న ఎయిర్ ట్యాక్సీ సేవలు
- ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడమే ప్రధాన ఉద్దేశం
- 45 నిమిషాల ప్రయాణం ఇకపై 10 నిమిషాల్లోనే..!
ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే రద్దీని బట్టి సుమారు 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. అయితే, ఈ ఎయిర్ ట్యాక్సీల ద్వారా కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. 2026 చివరి నాటికి ఈ సేవలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
మొదటి దశలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, పామ్ జుమేరా వంటి నాలుగు కీలక ప్రాంతాల్లో ఈ వర్టిపోర్టులను నిర్మించనున్నారు.
ఈ ఎయిర్ ట్యాక్సీలు పూర్తిగా విద్యుత్‌తో నడిచే వాహనాలు. హెలికాప్టర్ల తరహాలో నిలువుగా గాల్లోకి లేచి, నిలువుగా ల్యాండ్ అవుతాయి. వీటికి రన్‌వే అవసరం లేకపోవడంతో పాటు, తక్కువ శబ్దం చేస్తూ పర్యావరణహితంగా పనిచేస్తాయి.
ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల రాకతో పర్యాటకులు, వ్యాపారవేత్తలు విమానాశ్రయం నుంచి నేరుగా తమ గమ్యస్థానాలకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.