దొంగల్లా ఎత్తుకెళ్లడం దేనికి?: పూడి శ్రీహరి అరెస్టుపై పేర్ని నాని నిప్పులు
- పోలీసు వ్యవస్థ దిగజారడం శోచనీయమన్న పేర్ని నాని
- జగన్ చుట్టూ ఉన్నవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపాటు
- పర్యవసనాలను చంద్రబాబు అనుభవించక తప్పదని హెచ్చరిక
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కళ్లలో ఆనందం కోసం పోలీసు వ్యవస్థను ఇంతలా దిగజార్చడం శోచనీయమని మండిపడ్డారు. పూడి శ్రీహరి ఏమైనా నేరాలు చేశారా? అని ప్రశ్నించిన నాని, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలనుకుంటే బహిరంగంగా అరెస్ట్ చేయాలి కానీ, దొంగతనంగా ఎత్తుకెళ్లడం ఏంటని నిలదీశారు. విలేకరి స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఉగ్రవాదిలా చిత్రీకరిస్తూ కంప్యూటర్లు, ఫోన్లు సీజ్ చేయడం దారుణమన్నారు.
జగన్ చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలనే కుట్రతోనే 20 నెలలుగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో, జగన్ వెంట జెండా మోసేవారిని ఆపలేరని స్పష్టం చేశారు. "శ్రీహరిని 15 రోజులు జైల్లో పెట్టగలరు, అంతకంటే ఏం చేయగలరు? జైలు నుంచి వచ్చాక ఆయన మళ్ళీ జగన్ కోసమే పనిచేస్తారు" అని అన్నారు. లోకేశ్ మాటలు విని పోలీసు వ్యవస్థను పతనావస్థకు తీసుకెళుతున్నారని, దీని పర్యవసానాలను చంద్రబాబు అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టకట్టలేదని గుర్తు చేశారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, ప్రజలు ఇప్పటికే చంద్రబాబుకు మంగళహారతి పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని చంద్రబాబు, లోకేశ్ లకు హితవు పలికారు. పోలీసులు కూడా అతిగా వ్యవహరించి భవిష్యత్తులో ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు.