కాలిపోయిన నోట్ల కట్టల కేసు.. జస్టిస్ యశ్వంత్ వర్మ పదవికి రాజీనామా

Justice Yashwant Varma of Allahabad HC resigns
షార్ట్స్‌లో చూడండి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. తనపై అభిశంసన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఈ లేఖ కాపీని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు కూడా పంపినట్లు తెలిసింది.

గతేడాది మార్చి 14న జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసంలోని ఔట్‌హౌస్‌లో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలతో ఆయన తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని ఫలితంగా 2025 జులైలో లోక్‌సభలో 145 మంది, రాజ్యసభలో 63 మంది ఎంపీలు ఆయనపై అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.

దీంతో లోక్‌సభ స్పీకర్ 'జడ్జెస్‌ (ఇన్‌క్వైరీ) యాక్ట్‌, 1968' ప్రకారం ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటును జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అంతకుముందు సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేసినా ఆయనకు చుక్కెదురైంది.

తన రాజీనామా లేఖలో... "తీవ్ర ఆవేదనతో ఈ పదవి నుంచి వైదొలగుతున్నాను. నా రాజీనామాకు గల కారణాలు తెలిపి మీ ఉన్నత కార్యాలయానికి భారం కలిగించదలచుకోలేదు. ఈ పదవిలో సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను" అని జస్టిస్ వర్మ పేర్కొన్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Yashwant Varma
Justice Yashwant Varma
Allahabad High Court
Resignation
Impeachment
Justice Surya Kant
Droupadi Murmu

More Telugu News