రాణించిన కోల్‌కతా బ్యాటర్లు... లక్నో టార్గెట్ 182

KKR Sets 182 Target for Lucknow Super Giants
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మెరుగైన స్కోరు సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ ఫిన్ అలెన్ (9) విఫలమైనా, కెప్టెన్ అజింక్యా రహానే (41), అంగ్‌క్రిష్ రఘువంశీ (45) ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ముఖ్యంగా రహానే కేవలం 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో వేగంగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మంచి ఊపు మీదున్న సమయంలో వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడం, ఆ తర్వాత రింకూ సింగ్ (4) కూడా విఫలమవడంతో కేకేఆర్ 111 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కాస్త తడబడింది.

ఈ క్లిష్ట సమయంలో కామెరాన్ గ్రీన్ (32 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (39 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. చివరి ఓవర్లలో దూకుడుగా ఆడిన ఈ జోడీ, అబేధ్యమైన ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించి జట్టు స్కోరును 180 దాటించింది. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ, మణిమారన్ సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. వీరిలో దిగ్వేశ్ సింగ్ రాఠీ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు.
Go Back to Shorts
Ajinkya Rahane
Kolkata Knight Riders
Lucknow Super Giants
IPL 2026
Eden Gardens
Cameron Green
Rovman Powell
T20 Cricket

More Telugu News