వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం నిజమే అనిపిస్తోంది: అచ్చెన్నాయుడు

Atchannaidu Comments on YS Jagan Involvement in YSR Death
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేటి పరిస్థితులు చూస్తుంటే... వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ గతంలో వ్యక్తమైన అనుమానాలు నిజమేనని నమ్మాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవీ వ్యామోహంతో జగన్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని, ఆయన నైజం చూస్తుంటే నాడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అనిపిస్తోందని అన్నారు. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల కుటుంబం, సమాజం ఎలా నాశనమవుతాయో చెప్పడానికి జగన్ ఒక ఉత్తమ ఉదాహరణ అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ఇవాళ మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, "2009లో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు రాష్ట్రమంతా ఆందోళనలో ఉంది. కానీ, ఆ సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్ మరణవార్త నిర్ధారణ కాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేపట్టాల్సిన తొందర ఎందుకు వచ్చింది? వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు ప్రస్తుత వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను మేం నమ్మలేదు. కానీ, ఇప్పుడు జగన్ నైజం, ఆయన ప్రవర్తన చూస్తుంటే అవే నిజమేమో అనిపిస్తోంది" అని అన్నారు. 

తండ్రి బతికి ఉంటే తాను సీఎం కాలేనని భావించిన జగన్, ఆయనను మానసిక క్షోభకు గురిచేశారని, అందుకే వైఎస్సార్ ఆయన్ను రాష్ట్రానికి దూరంగా బెంగళూరు పంపించారని స్వయంగా రోశయ్యే చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.

"పదవీ వ్యామోహం ఉంటే సైకోలు తండ్రి, తల్లి, చెల్లి, బాబాయి అని కూడా చూడరని జగన్‌ను చూస్తే అర్థమవుతోంది. తండ్రి మరణంతో వచ్చిన సింపతీతో పార్టీ పెట్టి, 2014లో సీఎం అయ్యేందుకు ప్రయత్నించారు. 2019లో అధికారం కోసం సొంత బాబాయిని అత్యంత దారుణంగా హత్య చేయించి, ఆ సానుభూతితోనే గెలిచారు. వివేకాను ఎవరు చంపారో రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఇప్పుడు సొంత తల్లి, చెల్లే ఆయన అసలు నైజాన్ని బయటపెడుతున్నారు. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టమని అడిగిన కన్నతల్లినే ఇంట్లోంచి బయటకు పంపిన చరిత్ర జగన్‌ది" అని అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు.

జగన్ నిలకడలేని వ్యక్తిత్వానికి నిలువుటద్దమని, ఆయనో రాజకీయ సైకో అని అచ్చెన్న అభివర్ణించారు. "సీఎం పదవి కోసం కాంగ్రెస్‌పై దాడి చేశారు, బెయిల్ కోసం సోనియా కాళ్ల మీద పడ్డారు. అమరావతికి అంగీకరించి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడంతో 'మావిగన్' అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. జిల్లాల మధ్య తగువులు పెట్టే ఈ ప్రతిపాదనను చూసి వైసీపీ నేతలే నవ్వుకుంటున్నారు" అని ఎద్దేవా చేశారు.

ఉత్తరాంధ్రకు గత టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో కాలికి గజ్జె కట్టుకుని వివరిస్తానని సవాల్ విసిరారు. "అధికారంలో ఉన్న ఐదేళ్లు ఉత్తరాంధ్రకు ఏం చేశారని ఇప్పుడు మావిగన్ అంటున్నారు? పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. తన తల్లిలాంటి భువనేశ్వరి గారిని, అమరావతి మహిళలను, చివరికి కన్నచెల్లి షర్మిళ క్యారెక్టర్‌ను కూడా కించపరిచేలా మాట్లాడించిన జగన్‌కు ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదు. రాష్ట్ర ప్రజలకు జగన్ పిచ్చి చేష్టలు పూర్తిగా అర్థమయ్యాయి. ఆయన ఇక ఎప్పటికీ అధికారంలోకి రాలేరు. సమాజానికి పట్టిన చీడ పురుగు లాంటి జగన్, తన పదవి కోసం ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో ప్రజలు గుర్తుంచుకోవాలి" అని అచ్చెన్నాయుడు అన్నారు.


Go Back to Shorts
Atchannaidu
YS Jagan
YS Rajasekhara Reddy
Botsa Satyanarayana
Viveka Murder
YS Sharmila
Andhra Pradesh Politics
TDP
YSRCP
Chandrababu Naidu

More Telugu News