ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన పవన్, నారా లోకేశ్
హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడి యత్నం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. 'వీకెండ్ కామెంట్ బై ఆర్కే' కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ చర్యను ఏపీ ప్రభుత్వం, కూటమి నేతలు తీవ్రస్థాయిలో ఖండించారు.
వైసీపీ దాడులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ... ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేక దాడులకు దిగడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఒకవేళ కథనాల్లోని అంశాలు నచ్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలి తప్ప, ఇలా భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. గతంలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ... జగన్ కళ్లలో ఆనందం కోసం వైసీపీ రౌడీ మూకలు ఇలాంటి దాడులకు తెగబడటం ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గతంలో వైసీపీ హయాంలో బుల్డోజర్లు పంపించినా ఏబీఎన్ రాధాకృష్ణ వెనక్కి తగ్గలేదని... ఇప్పుడు మీ బెదిరింపులకు ఆయన భయపడరని అన్నారు. మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి లేదా ఆధారాలతో ఖండించాలని హితవు పలికారు. ప్రజలు ఛీకొట్టినా జగన్ మారడం లేదని విమర్శించారు.