CPI Narayana: గ్యాస్ కొరతపై చమత్కారంగా స్పందించిన సీపీఐ నారాయణ
దేశంలో నెలకొన్న వంట గ్యాస్ కొరత, పెరుగుతున్న ధరలపై సీపీఐ సీనియర్ నేత నారాయణ చమత్కారంగా స్పందించారు. తన ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో కనీసం కాఫీ, టీ కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, కేవలం పండ్లు తింటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పరిస్థితి లంకలో బాపనయ్యలా తయారైంది" అంటూ వ్యాఖ్యానించిన నారాయణ, ఇది కేవలం తన సమస్య మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా సామాన్యులందరూ ఎదుర్కొంటున్న సమస్య అని పేర్కొన్నారు.
ఇదే సమయలో ప్రధాని మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఒకవైపు గ్యాస్ అందుబాటులో ఉందని మోదీ అబద్ధాలు చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు ఖాళీ సిలిండర్లతో ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల తలెత్తిన యుద్ధ వాతావరణం గ్యాస్ సంక్షోభానికి కారణమని విశ్లేషించారు. భారత విదేశాంగ శాఖ యుద్ధాన్ని ఆపాల్సింది పోయి, బాధితులను బతిమాలడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. "అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని" అన్న సామెతను గుర్తు చేస్తూ, ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, సామాన్యుల ఇళ్లలో పొయ్యి వెలగని పరిస్థితికి కేంద్ర వైఫల్యమే కారణమని నారాయణ ధ్వజమెత్తారు.