Hyderabad: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ భగ్నం.. తారామతి రిసార్ట్‌పై ఈగల్ టీమ్ దాడులు

Hyderabad Drugs Case Busted at Taramati Resort Eagle Team Raid
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'ఈగల్' బృందం, నగరంలో మరోసారి ఆకస్మిక త‌నిఖీలు నిర్వ‌హించింది. నిన్న‌ అర్ధరాత్రి గోల్కొండ సమీపంలోని చారిత్రాత్మక తారామతి బారాదరి రిసార్ట్‌లో జరుగుతున్న ఓ హైప్రొఫైల్ పార్టీపై ఈగల్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు.

'జాక్ అండ్ జాన్సన్' పేరుతో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీమ్‌కు పక్కా సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ సహకారంతో అధికారులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి సమయంలో రిసార్ట్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, పార్టీలో ఉన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శనివారం కావడంతో ఈ పార్టీకి భారీ సంఖ్యలో యువతీయువకులు హాజరయ్యారని, వీరిలో కొందరు బాలీవుడ్ నటులు కూడా ఉన్నట్లు స‌మాచారం.

ఈ ఆపరేషన్ సందర్భంగా అనుమానం వచ్చిన పలువురికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రిసార్ట్ మొత్తాన్ని జల్లెడ పడుతూ, మాదకద్రవ్యాల కోసం ముమ్మరంగా గాలించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 'ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసి, అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పబ్‌లు, రిసార్టులు, ఫామ్‌హౌస్‌లపై నిరంతరం నిఘా పెడుతున్నారు.

ఇటీవల కొండాపూర్‌లోని ఓ పబ్‌పై దాడి చేసి, డ్రగ్స్ తీసుకున్న పలువురిని అరెస్ట్ చేసిన తర్వాత ఈగల్ బృందం చేపట్టిన మరో పెద్ద ఆపరేషన్ ఇదే కావడం గమనార్హం. అయితే, తారామతి రిసార్ట్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఏమైనా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారా అనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. 
Go Back to Shorts
Hyderabad
Hyderabad Drugs Case
Drugs
Taramati Baradari Resort
Eagle Team
Telangana
Drugs Party
R Revanth Reddy
Jack and Johnson Event
Bollywood

More Telugu News