చిత్ర పరిశ్రమలో 'కమిట్‌మెంట్' సంస్కృతిపై నటి పూనమ్ కౌర్ మరోసారి గళం విప్పారు. ఓ నిర్మాత తనను కమిట్‌మెంట్ అడిగాడని ఆరోపిస్తూ ఓ ఎన్నారై తెలుగు యువతి విడుదల చేసిన వీడియోపై స్పందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ యువతి వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న పూనమ్, ఆమెకు తన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా పూనమ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. "తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు ఉన్న సావిత్రి, జయప్రద, భానుప్రియ, శ్రీదేవి, సౌందర్య లాంటి గొప్ప నటీమణులు ఇప్పుడు ఎందుకు లేరు? అందం, అన్ని అర్హతలున్న ఎంతో మంది తెలుగు కళాకారులను నేను వ్యక్తిగతంగా కలిశాను. నాకు కూడా ఇదే బాధగా ఉంది" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఓ నిర్మాత తనను కమిట్‌మెంట్ అడిగాడని ఆ ఎన్నారై యువతి వీడియోలో ఆరోపించడం టాలీవుడ్‌లో మరోసారి కలకలం రేపింది. పరిశ్రమలో ఇలాంటి ధోరణులు ఉండటం వల్లే ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలు ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతున్నారని పూనమ్ పరోక్షంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీశాయి.