Samruddhi Expressway: సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోరం.. ఏడుగురు మహిళా కూలీల దుర్మరణం

Samruddhi Expressway accident kills seven women laborers in Jalna
షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్నా జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కడ్వాంచి గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కును వేగంగా వచ్చిన మరో ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితులంతా ఎక్స్‌ప్రెస్‌వే పనులకు వెళ్తున్న కూలీలు. వారు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కును ముంబై వైపు వెళ్తున్న ఓ భారీ ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, తలలకు గాయాలు, ఫ్రాక్చర్లతో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని జల్నాలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంతో హై-స్పీడ్ కారిడార్లలో భద్రతా చర్యలపై మరోసారి చర్చ మొదలైంది.
Go Back to Shorts
Samruddhi Expressway
Maharashtra road accident
Jalna district
road accident
expressway accident
laborers death
Devendra Fadnavis
accident compensation
road safety

More Telugu News