Vijay TVK: ఎన్నికల వేళ విజయ్ పార్టీకి షాక్.. టీవీకే అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు

Vijay Party Shock TVK Candidate Faces Harassment Case
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన ఓ అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు నమోదవడం కలకలం రేపుతోంది. పూనమల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన ప్రకాశ్‌ అలియాస్ కుట్టీపై సొంత పార్టీకి చెందిన ఓ మహిళా నేత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశ్‌ ప్రస్తుతం టీవీకే తిరువళ్లూరు దక్షిణ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. సుమారు ఆరు నెలల క్రితం తిరువళ్లూరులో జరిగిన ఓ వివాహ వేడుకలో ప్రకాశ్‌ తనను లైంగికంగా వేధించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌తో పాటు పలువురు జిల్లా స్థాయి నేతలు కూడా అక్కడే ఉన్నారని ఆమె తెలిపారు. ఈ విషయంపై అప్పట్లోనే పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

పార్టీలో న్యాయం జరగకపోవడంతో సోమవారం బాధితురాలు తన భర్తతో కలిసి తిరువళ్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తిరువళ్లూరు టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రకాశ్ అర్ధాంగి పోలీసులకు ఎదురు ఫిర్యాదు 
అయితే, ఈ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ప్రకాశ్‌పై వచ్చిన ఆరోపణలను ఆయన కుటుంబం ఖండించింది. ఇవన్నీ అవాస్తవాలని, కక్షపూరితమైనవని ఆరోపిస్తూ ప్రకాశ్ అర్ధాంగి పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు. పార్టీలో పదవి దక్కలేదన్న కోపంతోనే సదరు మహిళ ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే అధినేత విజయ్ ఇటీవలే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో ప్రకాశ్‌ను పూనమల్లి అభ్యర్థిగా ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కేసు దర్యాప్తు తమిళనాడు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Go Back to Shorts
Vijay TVK
Vijay
Tamilaga Vetri Kazhagam
Prakash alias Kutty
Sexual Harassment Case
Tamil Nadu Politics
Poonamallee Constituency
TVK Candidate
Anand TVK
Thiruvallur

More Telugu News