Padmarajan: 253వ సారి నామినేషన్ వేసిన 'ఎలక్షన్ కింగ్' పద్మరాజన్

తమిళనాడుకు చెందిన డాక్టర్ కె. పద్మరాజన్ మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. 'ఎలక్షన్ కింగ్'గా పేరుగాంచిన ఆయన ఏకంగా 253వ సారి తన నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం సేలం జిల్లాలోని మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

1988లో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పద్మరాజన్ పోటీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 252 ఎన్నికల్లో పోటీ చేసి అన్నింటిలోనూ ఓడిపోయారు. అత్యధిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తిగా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్‌లోనూ స్థానం సంపాదించారు. విశేషమేమిటంటే, ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.

ఈయన కేవలం సాధారణ అభ్యర్థులపైనే కాకుండా దేశంలోని పలువురు అగ్రనేతలపై కూడా పోటీ చేసి వార్తల్లో నిలిచారు. గతంలో వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఆరుసార్లు రాష్ట్రపతి పదవికి, ఏడుసార్లు ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు వేశారు.

ఈ సందర్భంగా పద్మరాజన్ మాట్లాడుతూ "నేను గెలవడం కోసం పోటీ చేయడం లేదు. ప్రజాస్వామ్యంలో సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని నిరూపించడమే నా లక్ష్యం" అని స్పష్టం చేశారు. హోమియోపతి వైద్యుడైన ఈయనకు టైర్ల రీట్రేడింగ్ వ్యాపారం కూడా ఉంది. కాగా, నామినేషన్ కోసం అవసరమైన డిపాజిట్ సొమ్మును తన స్నేహితుడి వద్ద అప్పుగా తీసుకుని చెల్లించడం గమనార్హం.
Padmarajan
Election King
Tamil Nadu
Indian Elections
Limca Book of Records
Guinness Book
Mettoor Assembly
Narendra Modi
Rahul Gandhi
Election Nomination

More Telugu News