Murali Naik: మీరొస్తే వాడి ఆత్మ శాంతిస్తుంది.. డిప్యూటీ సీఎం పవన్‌కు అమర జవాన్ తల్లిదండ్రుల కన్నీటి విజ్ఞప్తి

Army Jawan Murali Naik Death Anniversary His Parents Invited Deputy Cm Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భావోద్వేగ విజ్ఞప్తి చేసింది. తమ కుమారుడి మొదటి స్మారకార్థం నిర్వహించనున్న వైకుంఠ సమారాధన కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో సందేశాన్ని పంపింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది.

"పవన్ కల్యాణ్ సార్.. మా అబ్బాయి మురళీకి మీరంటే చాలా అభిమానం, ఇష్టం. ఉండేది ఒక్కడే అయినా, వద్దని వారించినా వినకుండా దేశసేవకే వెళ్లాడు. అనుకోకుండా ఏమైనా జరిగినా దేశ ప్రజలు మనతో ఉంటారని ధైర్యం చెప్పేవాడు. ఏప్రిల్ 14వ తేదీన మా ఊరు కల్లితండాలో వాడి వైకుంఠ సమారాధన జరుపుతున్నాం. మీరు వస్తే వాడి ఆత్మ శాంతిస్తుంది. మిమ్మల్ని ఎలా కలవాలో తెలియకే ఈ వీడియో పెడుతున్నాం. దయచేసి వచ్చి మా బిడ్డకు నివాళులు అర్పించండి" అంటూ జవాన్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి కన్నీటితో కోరారు.

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్, ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. దేశభక్తితో రైల్వే ఉద్యోగాన్ని సైతం వదులుకుని 2022లో అగ్నివీర్‌గా సైన్యంలో చేరారు. గతేడాది మే నెలలో జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 25 ఏళ్లకే వీరమరణం పొందారు.

మురళీ నాయక్ వీరమరణం పొందిన సమయంలో పవన్ కల్యాణ్ స్వయంగా కల్లితండాకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల ఆర్థిక సాయం, ఐదెకరాల భూమి ఇస్తామని ప్రకటించారు. అంతేగాక‌ వ్యక్తిగతంగా జనసేన పార్టీ తరఫున రూ. 25 లక్షల చెక్కును కూడా అందించారు. ఈ నేపథ్యంలోనే తమ కుమారుడి మొదటి స్మారక కార్యక్రమానికి పవన్ రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వారి ఎమోష‌న‌ల్‌ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Murali Naik
Pawan Kalyan
Amar Jawan
Jawan Murali Naik
Andhra Pradesh
Kallitanda
Operation Sindoor
Veera Maranam
Agniveer
Janasena

More Telugu News