Nitish Kumar: ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
బీహార్ రాజకీయ దిగ్గజం, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నితీశ్ ఈ నెలలో రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి రెండు సభల్లో సభ్యుడిగా ఎన్నికైనప్పుడు 14 రోజుల గడువులోపు ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ గడువు నేటితో ముగియనుండటంతో నితీశ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, నితీశ్ కుమార్ ఏప్రిల్ 9న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
పది సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ కెరీర్‌ను విశ్లేషకులు 'కూటమి రాజకీయాల్లో ఒక మాస్టర్ క్లాస్'గా అభివర్ణిస్తారు. 1985లో ఎమ్మెల్యేగా ప్రస్థానం ప్రారంభించి, వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, 2005లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే 2013 తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం 'రివాల్వింగ్ డోర్' (వరుస మార్పులు) కూటములతో సాగింది. బీజేపీ కూటమి - మహాఘటబంధన్ (RJD, కాంగ్రెస్)ల మధ్య 2013, 2017, 2022, 2024లో ఆయన తన పొత్తులను మార్చుకుంటూ సీఎం పదవిలో కొనసాగారు. అయితే, ముఖ్యమంత్రి పదవికి ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.