Telangana Weather: తెలంగాణకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్ష సూచన!

Rain Alert for Telangana Several Districts Expected to Receive Rainfall Today
షార్ట్స్‌లో చూడండి
గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఈ నెల‌ 30వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ప్రధానంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇదిలా ఉంటే.. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పగలంతా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బందిపడిన నగరవాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. శనివారం కూడా నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీంతో నగరంలో వాతావరణం మరింత చల్లబడనుంది.
Go Back to Shorts
Telangana Weather
Rain Alert
Hyderabad
IMD
Weather Forecast
Telangana Rains
Hyderabad Rains
Yellow Alert
Heatwave
Monsoon

More Telugu News